Sunday, December 23, 2007

The Heritage of Telugu Poem

“పద్యం చచ్చిపోయిందని ఆనందంతో చిందులుత్రొక్కే పరమమూర్ఖులు బయలుదేరారు ఈనాడు” అని కరుణార్ద్ర హృదయంతో వాపోయారు పూజ్యశ్రీ జంధ్యాల పపాయ్య శాస్త్రిగారు తమ “అమర్ ఖయ్యాం” కావ్యానికి రాసుకున్న ముందుమాటలో.

ఇది క్రీ.శ. ౧౯౮౭ (1987) నాటి మాట. ఇప్పుడు పద్యమేకాదు గద్యం కూడా అవిటిదై అవసానదశకొచ్చేసింది. ఆయన బాధ అంతటితో అగలేదు. “ఈ పద్యద్వేషం అన్నద్వేషం వలె అనారోగ్యకరమైనది. పద్యమైనా, గేయమైనా, వచనమైనా కవిత్వమనే పదార్ధం దానిలో ఉంటే అదితప్పక పదికాలాలపాటు బ్రతుకుతుంది. ఛందస్సులోని అందచందాలూ, ఒడుపులూ ఒయ్యరాలూ, వంపులూ బిగింపులూ తెలిసినవాడెవ్వడూ పద్యాన్ని పరిత్యజించలేడు.” అంటూనే “నరుడు వానరుడుగా మారి పిచ్చిగంతులు వేయనంతవరకూ, గంగా యమునా గోదావరీ కావేరీ నదులలో నీళ్ళున్నంతవరకూ, నన్నయ తిక్కన పోతనల ఆత్మలు తెలుగు హృదయాలను ఆవహించి ఉన్నంతవరకూ, హృద్యమూ అనవద్యమూ సహృదయైకవేద్యమూ అయిన పద్యం బ్రతికే ఉంటుంది.” అని ఘంటా పథంగా చెప్పి వెళ్ళిపోయిన ఆ మహాకవి చెప్పినదాంట్లో సత్తువెంతుందో పరికించి చూడాలంటే ఈ క్రింది పద్యం చదివితీరాలి – కాదు కాదు ఆస్వాదించి తీరాలి.

నోట్లొ వేసుకొంటే కరిగిపోయేలాంటి పాపయ్య శాస్త్రిగారి దాక్షాపాకం ఇది. “అమర్ ఖయ్యాం” పానపాత్రలోనుంచి చిమ్మిన సుధారసం. ఇంచుక అవలోకించండి.

కాలము నిల్వబోదు క్షణకాలము; మృత్యువు చేతిలోని కూ
జాలము; నిల్వజాలని నిజాలము; ఎప్పటి కేమొ చెప్పగా
జాలము; గాన ఎందుకిక జాలము? బాలకురంగనేత్ర! నీ
వాలుగనుల్ తళుక్కుమన వంచుము శీధువు పానపాత్రలో!